వోరుగల్లు పోరు ఖిల్లా
వల వల కన్నీరు కారుస్తుంది
సావుడప్పుల మోత మోగుతున్నది
ఒకరెంక ఒకళ్ళు
తెలంగాణా కోసం తనువుచాలిస్తున్రు
కండ్లు తెరవక ముందే
ఇంకొక్క సావు వార్త కూడా
రాక పొతే బాగుండు అని
నూటొక్క తీర్ల కోరుకుంట
ఇనెతొల్లు సేప్పెతోల్లు ఏరి
వెయ్యి స్తంబాలగుడికి కాలం చెల్లింది
కాకతీయుల వైభవం
కాలి బూడిదైతుంది
వెయ్యి పానాలు బలి బలి అంటుంది
భరద్వాజ్ బలి అయిపోయిండు
ఎన్ని నర బలులు కావాలనో మా నాయకులకు
సోనియమ్మ ఇటలి అమ్మకి
గొర్రెలు, మేకలు బలిస్తే సరిపోదు
ముక్కు పచ్చలారని బంగారు కొడుకులు బిడ్డలు
తల్లి తండ్రుల కడుపు కోతలు కావలె
ఎం పోరగాల్లు రా..
భాదని భరించలేక బడబాగ్నిని మింగుతున్నరు
ఇప్పటికన్నా సాలించున్రి..
మన బతుకు అవతలోనికి సావు కావలె
అప్పుడే తెలంగానోత్తది
అమ్మ తోడు..ఒక్కసారి వచ్చి చూడున్రి మమ్మల్ని!
బతకలేక సత్తున్నాం..సావలేక బతుకుతున్నాం
మీరు రోజుకింత సంపుతున్రు..
సాగానంపలేక సచ్చుబడున్నం..
సావకున్రి జర సంపకున్రి..

– సుజాత సూరేపల్లి

Advertisements