గరగపర్రులో దళితుల బహిష్కరణ!
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
గరగపర్రులో గత ఏడాది రాజకీయ నాయకులు ఓట్ల కోసం వచ్చినప్పుడు అంబేడ్కర్ విగ్రహాన్ని తామే పెడతామని చెప్పుకొచ్చారు. ఆ గ్రామంలో ఆంజనేయస్వామి, వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, అల్లూరి సీతారామ రాజు, గాంధీ, పొట్టి శ్రీరాములు, కాటన్, తాండ్ర పాపారాయుడు వంటి వాళ్ళ విగ్రహాలు పెట్టారు. మరి వాళ్ళందరివీ పెట్టేటప్పుడు ఎవరి అనుమతులు తీసుకున్నారో తెలవదు. ఇప్పుడు మాత్రం అక్కడ అంబేడ్కర్ విగ్రహం పెడితే ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ఇక్కడే మనకి కులం స్పష్టంగా కనపడుతుంది. గాంధీ, ఇతరనాయకుల విగ్రహాలు ఉన్నప్పుడు అంబేడ్కర్ ఎందుకు ఉండకూడదు? చెరువుగట్టున ఉండడం కూడా పెద్ద తప్పు వాళ్ళ దృష్టిలో!
అంబేడ్కర్ జయంతి నాడు జరగవలసిన ఆయన విగ్రహ ప్రతిష్ఠ జరగలేదు. కేవలం ఫ్లెక్సీ బ్యానర్‌తో బాబాసాహెబ్‌ జన్మదినం జరుపుకున్నారు. ఆగ్రహించిన గ్రామ ఆధిపత్య కులాలవారు పోలీసుల ద్వారా దళితులని బెదిరించారు. ఆ తరువాత దళితులు మరింత పట్టుదలతో ఏప్రిల్ 23న అంబేడ్కర్‌ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తెల్లారి చూసే సరికి విగ్రహం కనపడక పోవడంతో దళితులు ఆందోళనకి దిగారు. అధికారులు పోలీసులని మొహరించి, సబ్ కలెక్టర్ ద్వారా విగ్రహాన్ని వెతికితెచ్చి పంచాయతీ కార్యాలయం దగ్గర పెట్టారు. దీన్ని తట్టుకోలేని రాజులు మండిపడ్డారు. గ్రామంలో ఇతరకులాల వాళ్ళను పిలిచి గుళ్లో మీటింగ్ పెట్టి ఊర్లో ఉన్న దళితులందరినీ అన్నివిధాలుగా బహిష్కరించాలని నిర్ణయించారు. వాళ్ళతో ఎవరూ మాట్లాడొద్దని, మాట్లాడితే 1000 రూపాయల జరిమానా వేయాలని నిర్ణయించారు. అలాగే దళితులకు ఎటువంటి పనులు ఇవ్వవద్దని, ఒకవేళ ఇస్తే రూ. 10,000 జరిమానా వేయాలని నిర్ణయించారు. దళితులకు భూములు ఇవ్వకూడదనీ నిర్ణయం తీసుకున్నారు. ఏండ్ల నుంచి కౌలు చేసుకుంటున్న భూములను తిరిగి తీసుకుని ఇతర బీసీ కులాలవారికి ఇచ్చినట్టు చెబుతున్నారు. ఊర్లో పలుచోట్ల సీసీ కెమెరాలు పెట్టి దళితుల దగ్గరకి ఎవరెవరు వస్తున్నారో చూస్తూ అందరినీ కనిపెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గత 50 రోజులుగా నడుస్తున్న ఈ బహిష్కరణని మీడియాలో రాకుండా ఎవరికీ తెలియకుండా రాజులు జాగ్రత్త పడ్డారు. తరువాత ఒక ప్రముఖ ఛానెల్ వీడియో తీసి ప్రసారం చేయడంతో ఈ విషయం ఒక పెద్ద విస్ఫోటనంలా పాకింది. సామాజిక మాధ్యమాలలో తీవ్ర స్పందనవచ్చి ఈ నెల 25న పలు ప్రజాసంఘాలు, వ్యక్తులు ‘చలో గరగపర్రు’ పిలుపునివ్వడంతో తెలంగాణ, ఇంకా ఇతరప్రాంతాల నుంచి వందలాదిగా సంఘాలు, కార్యకర్తలు, నిజనిర్ధారణ కమిటీలు ఆ గ్రామానికి చేరుకున్నారు.

ఆ ఒక్క పిలుపుతోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఆందోళన ఉధృతం కావడంతో పోలీస్‌ పికెటింగ్‌ అన్నిచోట్ల పెట్టి బయటినుంచి ఎవరినీ రానివ్వకుండా చేశారు. 144 సెక్షన్ కూడా విధించారు. ఇంత చేసినా కూడా స్థానికులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. వానలో, బురదలో, పొలాల గట్ల మీద పడి అనేకమంది కార్యకర్తలు, సంఘాల ప్రతినిధులు ఆ ఊరికి చేరుకున్నారు. పోలీసు యంత్రాంగం, జిల్లా కలెక్టర్, ఎమ్మార్వోలు అందరూ కూడా గరగపర్రు బాట పట్టక తప్పలేదు. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాములు గారు వచ్చి దళితుల్ని బహిష్కరించిన వారిని 24గంటల్లో అరెస్టుచేయాలని ఆదేశించారు. అయినా ఇప్పటికీ ఎవరినీ అరెస్టు చేయలేదు. అయితే ఈ మధ్య కాలంలో కులానికి సంబంధించిన అంశాలలో ఒక విషయం స్పష్టంగా కనపడుతుంది. అధికారులుగా, కావాలనే దళితులని నియమించడం, తీవ్ర వత్తిడి తీసుకొచ్చి వారిని పనిచేయకుండా చేయడం జరుగుతోంది. నిష్పక్షపాతంగా ఉండాల్సిన అధికారులు అనేక రాజకీయ వత్తిడులకి లొంగ డం సహజమే. అక్కడ ఉన్న దళిత ఎమ్మార్వోని సస్పెండ్ చేశారు. ఆమె నాకు ఏమీ తెలియదు, మమ్ముల్ని ఏమి చేయనివ్వరు అని వెళ్లిన వాళ్ళతో చెప్పినట్టు కార్యకర్తలు చెబుతున్నారు. ఇప్పుడు ఒక్కరోజులో మారిపోయిన పోలీసు అధికారి కూడా దళితుడే.
అర్ధ, అంగ బలం, రాజకీయ అండదండలు ఉన్న ఆధిపత్య కులాలను కాదని స్థానిక ప్రభుత్వాలు పేద ప్రజల వైపు నిలబడడం చాలా అరుదు. న్యాయాలు, చట్టాలు అన్నీ కూడా డబ్బు, కులం అధీనంలో ఉన్నాయని చుండూరు నుంచి జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. దళితులని నిత్యం అనేక ప్రలోభాలు పెడుతూ విడదీస్తున్న పాలక వర్గాలు, నిమ్మకి నీరెత్తినట్టు ఉండే ఇతర కులాల వైఖరి వల్ల దళితులు నిరంతరం అనేక అణచివేతలకు గురవుతున్నారు. భూమి పంపకం, ఉచిత విద్య, వైద్యం, ఉండడానికి ఇండ్లు, జీవనోపాధి కల్పించకపోతే ఇటువంటి దాడులు ఆగవు, దోపిడీ ఆగదు. పోరాటాలు ఆగవు. ఈ దేశం ముందుకు పోవాలంటే కుల నిర్మూలనే మార్గం, అది కాకుండా ఎన్ని సాంకేతిక విజయాల్ని సాధించినా జరిగే మార్పు శూన్యం.
సుజాత సూరేపల్లి – శాతవాహన యూనివర్సిటీ
– Andhrajyothi Jun.29, 2017

Advertisements